చగంటి గారి మహాశివరాత్రి ప్రవచనం

 


*ఓం నమః శివాయ*


*🙏చగంటి గారి ప్రవచనం 🙏*


ఒకనాడు లింగావిర్భావ కాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం(మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగితే మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. మొగలిపువ్వు చెప్తాను అన్నది. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగితే విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.

బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! అంటే కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి.

Post a Comment

Comments