‘మోదీ మౌనం’ దేశానికి ప్రమాదం!
కొణతాల రామకృష్ణ
మాజీ పార్లమెంట్ సభ్యులు
అదానీ వ్యవహారంమీద ప్రధాని మోదీ పార్లమెంట్‌లో సమాధానం చెప్పకుండా తప్పించుకున్నా, ప్రజాక్షేత్రంలో మాత్రం జవాబు చెప్పుకోక తప్పదు. ఇలాగే మౌనం పాటిస్తే, అదానీ షేర్లలాగే, మోదీ గ్రాఫ్ కూడా అతివేగంగా పడిపోవడం ఖాయం!
అదానీ–మోదీ బంధం దేశ ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. నిత్యావసరాలు మొదలుకొని బొగ్గు, విద్యుత్, సిమెంటు, రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు వంటి దేశ అత్యవసరాల వరకు అన్నీ వ్యాపారాల్లోనూ అదానీ కాలుపెట్టారు. దాదాపు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూపు సంక్షోభంవల్ల ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతాడు. ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగులు సైతం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో, ఎల్‌ఐసి వంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ పాలసీలు కొంటున్నారు. ఈ సంస్థలన్నీ తిరిగి స్టాక్ మార్కెట్‌లోనే పెట్టుబడులు పెడుతుంటాయి. షేర్ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌కి సంబంధించిన పది లిస్టెడ్ కంపెనీల్లో లక్షలాది మంది, కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి, అదానీ వ్యవహారం ఏ మాత్రం కింది మీదికైనా మోదీ ఎకనమిక్ విజన్ పట్టాలు తప్పుతుంది. అదానీ పతనం ప్రభావం ప్రజలపై ఎంత ఉంటుందో, మోదీపై అంతకు రెట్టింపు ఉంటుంది.
1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, మైనింగ్ ఇలా ప్రతిదాన్ని ప్రయివేట్‌కి అప్పగిస్తే ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని నమ్ముతూ పెట్టుబడిదారులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతూ వస్తున్నారు. 2014 తర్వాత 30కి పైగా ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలను అదానీ కొనుగోలు చేశారు. కొవిడ్ నష్టాలను పూడ్చుకోవడానికే అదానీకి ముంబై ఎయిర్‌పోర్టును అమ్మినట్లు జీవీకే సంస్థ సమర్థించుకుంటున్నా... నష్టాల్లో ఉన్నదాన్ని అదానీ ఎందుకు కొనుక్కుంటారో సామాన్యులు సైతం అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్‌లో బీఓటీ పద్ధతిలో నిర్మించిన గంగవరం పోర్టు 33 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి దక్కాలి. కానీ, అంతకన్నా ముందే అది అదానీ పరమైంది. లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును అవసరం లేకున్నా జగన్ ప్రభుత్వం అదానీకి అప్పగించింది. ప్రయివేట్ యాజమాన్యంలో లాభాల్లో నడుస్తున్న కృష్ణపట్నం పోర్టు కూడా 2020లో అదానీ చేతిలోకి వెళ్లిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆస్తుల్ని అదానీ హస్తగతం చేసుకుంటూ వస్తున్నారు. ఒకే వ్యక్తి గుత్తాధిపత్యం దేశానికి, ప్రజలకు మంచిది కాదని చరిత్ర చెప్తున్నా ప్రభుత్వాలు అదానీకే అన్ని రంగాల్లో గుత్తాధిపత్యం కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తోంది.
2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ప్రజల ముందు తనను తాను ఒక కొత్త నాయకుడిగా ఆవిష్కరించుకోవడం నరేంద్రమోదీకి ఒక అవసరంగా మారింది. దీనికోసం గుజరాత్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి 2003 నుంచి ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరిట వార్షిక సదస్సులు నిర్వహించడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఈ సదస్సులను ముందుండి నడిపిస్తూ, మోదీకి గౌతమ్ అదానీ సన్నిహితుడయ్యారు. ఆ తర్వాత తమ ప్రయోజనాలకు అనుకూలంగా ఒకరికొకరూ విధేయులుగా మారారు. 2014 ఎన్నికల ప్రచారానికి దేశవ్యాప్తంగా మోదీ తిరిగిన విమానం కూడా అదానీదే. అక్కడి నుంచి మోదీ రాజకీయ రంగంలో, అదానీ వ్యాపార రంగంలో ఒకేసారి జంట పక్షుల్లా ఆకాశానికి దూసుకెళ్లడం మొదలైంది.
2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ విల్మర్ షేర్లు ఊహకు కూడా అందని విధంగా 200 శాతం నుంచి గరిష్టంగా 4500శాతం వరకు పెరిగాయి. వీటికి తోడు అదానీ కొత్తగా కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్, ఎన్డీటీవీ సంస్థల షేర్లు కూడా విపరీతంగా పెరగడంతో గత రెండున్నరేళ్ల కాల వ్యవధిలో అదానీ సంపద విలువ వెయ్యి కోట్ల డాలర్ల నుంచి 13,700 కోట్ల డాలర్లకు పెరిగింది. ఫలితంగా అదానీ ప్రపంచ కుబేరుల్లో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకారు.
అదానీ కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసి రూ.35 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఎస్‌బిఐ 27 వేల కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏడు వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగువేల కోట్ల రూపాయలు అదానీకి అప్పులిచ్చాయి. వీరితో పాటు అదానీ కంపెనీల్లో అధికంగా పెట్టుబడులు పెట్టిన సాధారణ పౌరులూ ఇందులో చిక్కుకుపోయారు. అదానీ కంపెనీల షేర్లు పెరుగుతున్నాయన్న ఒకే ఒక్క కారణంతో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఈ వ్యవహారాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సుప్రీంకోర్టు మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ, స్టాక్‌మార్కెట్‌పై నియంత్రణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, సెబీకి సూచించింది.
నిపుణుల కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కానీ, అమాయకులు నష్టపోతుంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చీమకుట్టినట్లు కూడా లేదు.
పార్లమెంట్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా విపక్షాలు మోదీ–అదానీల బంధంపై చేస్తున్న ఆరోపణలకు కూడా మోదీ సమాధానం ఇవ్వలేదు. ఇది ప్రజల్లోకి మోదీ పట్ల ప్రతికూల సంకేతాలను పంపుతోంది. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తూ మోదీ ఓ మెరుపులాంటి ఉపన్యాసం ఇచ్చినా, తన మరక గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఆర్‌బీఐ, సెబీ ఈ విషయంలో చేయాల్సింది చేస్తాయని కంటితుడుపుగా బీజేపీ చెప్తున్నా ప్రజలకూ, మదుపరులకూ నమ్మకం కుదరడం లేదు. అదానీ కంపెనీలపై అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ప్రజలు లెక్కపెట్టడం లేదు. దీనికి తోడు ప్రపంచ స్టాక్ మార్కెట్ రేటింగ్ సంస్థలు అనేకం అదానీ కంపెనీలకు ప్రతికూల రేటింగ్స్ ఇస్తుండటంతో రోజురోజుకి ఆ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ అదానీ వ్యవహారమే. దీనిపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పకుండా తప్పించుకున్నా... ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పకుండా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాగే మౌనం పాటిస్తే, అదానీ షేర్లలాగే, మోదీ గ్రాఫ్ కూడా అతివేగంగా పడిపోవడం ఖాయం!
కొణతాల రామకృష్ణ
మాజీ పార్లమెంట్ సభ్యులు
Comments