బుద్ధుడు: తనను తాను దేవుని దూతగా ప్రకటించుకోలేదు



మొక్కై వంగనిది మానై వంగుతుందా?’ అనేది సామెత. సత్యమే సామెతగా ప్రజల్లో ప్రచారం అవుతుంది. మంచయినా, చెడైనా మనుషుల్లో మొక్కగానే మొదలవుతుంది. మంచయితే దాన్ని మరింత పెరిగేలా చూడాలి. అదే చెడైతే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. ఒక చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని ఉపేక్షించి వదిలెయ్యకూడదని బుద్ధుడు చెప్పిన అయిదుగురి కథ ఇది. 

ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరూ పొలం పనులు చేసేవారు. ఎవరి మంచి నీటి కుండ వారే తీసుకుపోయేవారు. ఆ కుండలను ఒక చెట్టు కింద ఉంచి, పొలం పనులు చేసేవారు. దాహం వేసినప్పుడు వచ్చి ఎవరి కుండలో నీరు వారే తాగేవారు. కానీ ఒకసారి ఒకడు మంచి నీటి కోసం వచ్చి, వేరేవారి కుండలో నీరు తాగాడు. తిరిగి వెళ్ళి పనిలో పడ్డాడు. ఆ రోజు సాయంత్రం అతను నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చింది. ‘నాలో ‘దొంగతనం’ అనే దోష గుణం ప్రవేశించింది. దీన్ని ఇప్పుడే తుంచేసుకోవాలి. ఇలాగే వదిలేస్తే పెరిగి పెద్దదైపోతుంది. నన్ను దొంగను చేస్తుంది’ అనుకున్నాడు. చెడ్డ లక్షణాన్ని చూసి భయపడ్డాడు. ఆ భయమే అతణ్ణి తీర్చిదిద్దింది.

మోహం దహించేస్తుంది...

ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉన్నాడు. న్యాయమైన ధరలకు సరుకులు ఇస్తాడనీ, కల్తీ వస్తువులను అమ్మడనీ, తూకంలో మోసం చెయ్యడనీ మంచి పేరుంది. ఒక రోజు భార్యాభర్తలిద్దరు అతని దుకాణానికి వచ్చారు. ఆమె చాలా అందంగా ఉంది. చక్కగా అలంకరించుకుంది. ఆమెను చూడగానే వ్యాపారి మోహంలో పడ్డాడు. దురాచలోచన కలిగింది. ఆ రోజు రాత్రి భోజనం చేసి, నిద్రకు సిద్ధమవుతూ ఉండగా... తనకు కలిగిన ఆ కామవికారం గుర్తుకు వచ్చింది. ‘ఇది నిప్పు రవ్వ. ఈ చిన్న రవ్వ చాలు, ఊరూ వాడా తగలబెట్టడానికి. ఇది నన్ను నిలువునా దహించేస్తుంది. కీర్తిని హరిస్తుంది. కుటుంబానికి దూరం చేస్తుంది’ అనుకున్నాడు. భయపడ్డాడు. ఇక అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాడు. మనశ్శాంతి పొందాడు. అలా తనను తాను సరిదిద్దుకున్నాడు.

అసత్యం దుఃఖకారకం...

మరో సందర్భంలో... ఒక వ్యక్తి, అతని కొడుకూ కొండ దారిలో వెళ్తున్నారు. అక్కడ దొంగలు ఉంటారు. బాటసారుల్ని పట్టుకుంటారు. దొరికినవారు గురు శిష్యులైతే గురువును తమ దగ్గర ఉంచుకొని, శిష్యుణ్ణి విడిచిపెడతారు. వెళ్ళి డబ్బు తెమ్మంటారు. అన్నా తమ్ముళ్ళైతే అన్ననూ, తండ్రీ కొడుకులైతే తండ్రినీ వదిలిపెడతారు. వారైతే మిగిలిన వారి కోసం తిరిగి తప్పక వస్తారనీ, అడిగిన డబ్బు తెస్తారనీ దొంగల నమ్మకం. ఈ విషయం తెలిసిన తండ్రి తన కొడుకుతో ‘‘ఒకవేళ దొంగలు పట్టుకుంటే నేను నీ తండ్రినని చెప్పకు. నీవు నా బిడ్డవని నేను చెప్పను’’ అన్నాడు. కొంతసేపటికి వారిద్దరినీ దొంగలు పట్టుకున్నారు. ఇద్దరూ అబద్ధం చెప్పారు. దొంగలు వారిని వదిలిపెట్టారు. కానీ, అబద్ధం చెప్పాననే బాధ మాత్రం ఆ కొడుకును వదిలిపెట్టలేదు. ‘ఈ అలవాటు ఇలా ముదిరితే చివరకు మోసకారినైపోతాను. అది దుఃఖకారకం అవుతుంది’ అని భయపడ్డాడు. ‘ఇక ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు’ అని నిర్ణయించుకున్నాడు. అలాగే జీవించాడు.

జీవహింస కూడదు...

ఒక ఊరిలో జాతరలు జరుగుతున్నాయి. గ్రామస్తులు వందలాది మేకలనూ, కోళ్ళనూ, ఇతర జంతువులనూ బలికి సిద్ధం చేశారు. అయితే, బలి క్రియకు సంఘం పెద్ద అనుమతి కావాలి. గ్రామస్తులు వెళ్ళి అడిగారు. సంఘం పెద్ద ‘సరే’ అన్నాడు. బలి క్రియ పూర్తయింది. ఆ ప్రాంతం రక్తంతో తడిసి ఎర్రబడింది. వేలాది జంతువుల తలలు పోగుపడ్డాయి. మాంసం గుట్టలు గుట్టలుగా చేరింది. ఈ దృశ్యాన్ని చూడగానే సంఘం పెద్ద మనసు చివుక్కుమంది. హృదయం ద్రవించింది. ‘నా ఒక్క మాట వల్లే ఈ జీవహింస జరిగింది. ఇక ఇలాంటి కర్మకాండలను అనుమతించకూడదు’ అనుకున్నాడు. హింసా ప్రవృత్తిని తుంచేసుకోవాలనుకున్నాడు. ఆనాటి నుంచి ఆ సంఘంలో జంతు హింసను ఆపించాడు.

మత్తుతో అనర్థం...

ఆ రోజుల్లో మద్యపాన ఉత్సవాలు జరిగేవి. రకరకాల మద్యాన్ని తయారు చేసుకున్న గ్రామ ప్రజలు గ్రామాధికారి దగ్గరకు వచ్చి, అనుమతి అడిగేవారు. ఆయన అనుమతి ఇచ్చాడు. ప్రజలు తాగారు, ఊగారు. తిట్టుకున్నారు. తలలు పగిలాయి. కాళ్ళు, చేతులు విరిగాయి. ఉత్సవం చివరకు విషాదంగా మారింది. ‘దీనంతటికీ తప్పు నాదే’ అని పశ్చాత్తాపపడ్డాడు గ్రామాధికారి. ‘మనిషిని మత్తులో ముంచి, ప్రమత్తత కలిగించి, పశువుల్లా మార్చే మద్యపానానికి అనుమతి ఇవ్వడం వల్లే ఈ ఘోరం జరిగింది ’అనుకున్నాడు. ఇంకెప్పుడూ అలాంటివాటికి అనుమతి ఇవ్వలేదు.

ఇలా అయిదుగురు తమ అనుభవం ద్వారా ‘పంచశీల’ను గ్రహించారు. తమను తాము దిద్దుకున్నారు. తాము చేసిన తప్పులను తెలుసుకొని, ఆదిలోనే సరి చేసుకున్నారు. 

ఇలా తమను తాము సరిదిద్దుకుంటూ శీలగుణాలను పెంపొందించుకోవాలని ఈ కథల ద్వారా బుద్ధుడు బోధించాడు.

బుద్ధుడు తనను తాను దేవుని దూతగా ప్రకటించుకోలేదు. మోక్షదాతగానూ చెప్పుకోలేదు. తాను ఒక మార్గదాతనని మాత్రమే చెప్పాడు. ఆచరణలో చూపాడు. దుఃఖసాగరంలో మునిగి తేలుతున్న మానవ సమాజానికీ, అసమానతలతో అలమటిస్తున్న ప్రజా సందోహానికీ దుఃఖ నిర్వాణ మార్గాన్ని చూపించాడు. అందువల్లనే బుద్ధుడు కాలంతోపాటు కనుమరుగు కాలేదు. ‘‘నేను చెప్పినది ఏదైనా మీ అనుభవానికి అందకపోతే గుడ్డిగా విశ్వసించకండి’’ అని చెప్పాడు. కాబట్టే కాలాన్ని జయించి, ఇన్ని వేల సంవత్సరాలు తన ధర్మంతో ధరణీతలాన్ని తడిపి, మానవీయ ఫలాలను పండించగలుగుతున్నాడు.

అలాంటి మనహనీయుడు సాధారణ మానవుల్లా మరణానికి భయపడతాడా! అలాంటి భయం లేదు కాబట్టే ప్రాణాలకు ప్రమాదం కలిగించే యుద్ధ క్షేత్రాల మధ్యకు వెళ్ళి నిలబడ్డాడు. యుద్ధాలను ఆపుచేయించాడు. అతి క్రూరులైన వారి దగ్గరకు ఒంటరిగానే వెళ్ళాడు. వారిలో పరివర్తన కలిగించాడు. సర్వాన్నీ త్యజించిన త్యాగి... ప్రాణం కోసం పాకులాడుతాడా!

బుద్ధుడు ముప్ఫై ఆరవ యేట జ్ఞానోదయం పొందిన తరువాత దాదాపు నలభై అయిదేళ్ళు తన ధర్మాన్ని నిర్విరామంగా ప్రచారం చేశాడు. ప్రజల నుంచి కనీ వినీ ఎరుగని ఆదరణ పొందాడు. బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. వ్యక్తులకన్నా సంఘమే చిరస్థాయిగా నిలబడుతుందని నమ్మాడు. వేలాది ఆరామాలు, విహారాలు, సంఘ శాఖలు ఏర్పడిన తరువాత... ఇక నిర్వాణ మార్గానికి మళ్ళాలని అనుకున్నాడు. 

అది బుద్ధుడి ఎనభయ్యో సంవత్సరం. ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. తన చివరి ‘చారిక’లో భాగంగా వైశాలీ నగరానికి వచ్చాడు. ఆమ్రపాలికి చెందిన ఆమ్రవనంలో కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడకు దగ్గరలో ఉన్న బేళువ అనే గ్రామంలో ఆ ఏడాది వర్షావాసాన్ని గడిపాడు. ఆ కాలంలోనే ఆయనకు ఉదర సంబంధమైన వ్యాది కలిగింది. ఔషధాలు సేవిస్తూ, ధ్యానం ద్వారా నొప్పిని భరించాడు. వ్యాధి తగ్గి, వర్షావాసం ముగిశాక తిరిగి వైశాలిలోని చాపల చైత్యానికి చేరాడు. తన ప్రధాన అనుయాయుడైన ఆనందుణ్ణి పిలిచి, ‘‘ఆనందా! తథాగతుడు పరినిర్వాణం చెందే సమయం ఆసన్నమయింది. మూడు నెలల్లో పరినిర్వాణం పొందుతాను. ఆనందా! మనకు ప్రియమైనవి దూరం అవుతాయి. విభాజ్యం చెదుతాయి. విడిపోతాయి. 

పుట్టిన ప్రతీదీ గిట్టుతుంది. సంస్కారాలు సర్వం అనిత్యాలే!’’ అన్నాడు మందహాసంతో. ఆనందుడు కలవరపడ్డాడు. అతని కంట నీరు గూడు కట్టింది.

ఆ రోజు మాఘ పున్నమి. బుద్ధుని కోరికపై శ్రావస్తి సమీపంలోని భిక్షువులందరినీ మహాకూటగారశాలలో ఆ పున్నమి రాత్రి సమావేశపరిచారు. బుద్ధుడు వారికి ధర్మోపదేశం చేసి, తన నిర్మాణాన్ని ప్రకటించాడు. ఆ మరునాడు లిచ్ఛవుల రాజధాని వైశాలి నుంచి మల్లుల రాజధాని కుసీనరకు బుద్ధుడు బయలుదేరాడు. వైశాలి ఉత్తర పొలిమేర దాకా లిచ్ఛవులు వచ్చారు. వారికి తన భిక్షా పాత్రను ఆయన ఇచ్చేశాడు. జనం కన్నీరు మున్నీరవుతూ బుద్ధుణ్ణి సాగనంపారు.  ‘‘ఇదే వైశాలిని నేను చూసే చివరి చూపు’’ అని అయన వెనక్కు తిరిగి, చాలా సేపు వైశాలి వైపు చూశాడు. అనంతరం బయలుదేరి, పలు గ్రామాల మీదుగా భోగనగరం చేరి, ఆనంద చైత్యంలో కొన్నాళ్ళు ఉన్నాడు.

అక్కడ ప్రజలకు బోధ చేస్తూ, ‘‘ఎవరైనా ‘‘బుద్ధుడి నోటి నుంచి నా చెవులారా విన్నాను. తథాగతుడు చెప్పినది ఇదే!’’ అని చెబితే దాన్ని మూఢంగా నమ్మకండి. నా సూత్రాలు, నియమాలతో కలవని దేనినీ బుద్ధ వచనంగా విశ్వసించకండి’’ అని చెప్పాడు.  అక్కడే చైత్ర పౌర్ణమి సమావేశం జరిగింది. ఆ తరువాత మరిన్ని గ్రామాలు తిరుగుతూ పావానగరం చేరాడు. చుందుడు అనే అనుయాయుడు పెట్టిన ఆహారం తిన్నాక, బుద్ధుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. అక్కడే కొన్నాళ్ళు ఉండి, తిరిగి బయలుదేరి, వైశాఖ పౌర్ణమి నాటికి కుసీనరకు చేరాడు. ఆ రాత్రే బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగింది. 

ఇలా... బుద్ధుడు తన పరినిర్వాణ విషయాన్ని మూడు నెలలు ముందే... మాఘ పున్నమి నాడు ప్రకటించాడు. అలా ఈ పున్నమికి బౌద్ధంలో ఒక విశేష ప్రాధాన్యం ఉంది. అంతేకాదు... తన బౌద్ధ సంఘం మొత్తానికి ధ్మసేనాపతిగా సారిపుత్ర భిక్షువును మాఘ పున్నమి రోజునే బుద్ధుడు నియమించాడు. అలాగే... తొలి ధర్మచక్ర ప్రవర్తన జరిగిన ఆషాఢ పున్నమి అనంతరం వచ్చిన వర్షావాసం తరువాత.... మాఘ పున్నమి రోజునే బౌద్ధ సంఘానికి తొలిసారిగా కొన్ని నియమాలు బుద్ధుడు ఏర్పరిచాడు. ఈ భిక్షు నియమాలు ‘వినయ పిటకం’గా ప్రసిద్ధి చెందాయి. అలా బౌద్ధ సంస్కృతిలో మాఘ పున్నమి ఒక విశిష్ట స్థానాన్ని పొందింది.బుద్ధుడు ముప్ఫై ఆరవ యేట జ్ఞానోదయం పొందిన తరువాత దాదాపు నలభై అయిదేళ్ళు తన ధర్మాన్ని నిర్విరామంగా ప్రచారం చేశాడు.

 ప్రజల నుంచి కనీ వినీ ఎరుగని ఆదరణ పొందాడు. బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. వ్యక్తులకన్నా సంఘమే చిరస్థాయిగా నిలబడుతుందని నమ్మాడు. వేలాది ఆరామాలు, విహారాలు, సంఘ శాఖలు ఏర్పడిన తరువాత... ఇక నిర్వాణ మార్గానికి మళ్ళాలని అనుకున్నాడు.

Post a Comment

Comments