Hyderabad: ప్రీతి స్వస్థలానికి చేరిన మృతదేహం కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం..

ఎట్టకేలకు ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించించారు. మరోవైపు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు  ఆమె తండ్రి తెలిపారు.  

హైదరాబాద్‌: ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి నిమ్స్‌ ఆసుపత్రిలో మృతిచెందింది. దీంతో నిమ్స్‌ ఆసుపత్రిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిమ్స్‌ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు యత్నించగా ఆమె తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. ప్రీతి మృతిచెందడానికి గల కారణాలు తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్రీతికి ఇంజక్షన్‌ ఇచ్చారని ఆరోపించారు. 

ఈ నెల 22 ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టారు. సీనియర్‌ విద్యార్థిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రీతి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. దీంతో ప్రీతి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీకి తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లకుండా ప్రీతి బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. శవపరీక్షకు తమను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు.

శవపరీక్ష పూర్తి అయిన అనంతరం పోలీసు భద్రత మధ్య కుటుంబ సభ్యులకు ప్రీతి మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రీతి మృతదేహాన్ని స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు చేర్చారు. మృతదేహం వద్ద ప్రీతి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం: మంత్రి హామీ!

ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రభుత్వం రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు ప్రీతి తండ్రి తెలిపారు. కుటుంబంలో ఒకరికి గెజిటెడ్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, అంతేకాకుండా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపిస్తానని మంత్రి చెప్పినట్లు ప్రీతి తండ్రి  పేర్కొన్నారు.  హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు సైతం హామీ ఇచ్చారని చెప్పారు. 

అంతకుముందు ప్రీతి మృతి వార్త తెలియడంతో విద్యార్థి సంఘాల నేతలు, భాజపా కార్యకర్తలు నిమ్స్‌ ఆసుపత్రికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ప్రీతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించేందుకు యత్నిస్తుండగా ప్రీతి బంధువులు, గిరిజనులు, ఎస్టీ సంఘాలు, భాజపా కార్యకర్తలు వాహనం ముందు బైఠాయించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ప్రీతి మృతదేహాన్ని ప్రగతిభవన్‌కు తీసుకెళ్తామని ఆమె బంధువులు తెలిపారు. ప్రీతి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలన్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌ను తరలించారు.  

ఇక ప్రీతి స్వగ్రామంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేంఎసీ ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. 

విధులకు ఆటంకం కలగకుండా చూడాలి: నిమ్స్‌ డైరెక్టర్‌

వైద్య సేవలు అందించడంలో అంతరాయం కలగకుండా చూడాలని నిమ్స్‌ డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి వైద్యులు, సిబ్బందికి సహకరించాలన్నారు. విధులకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ప్రీతి చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మా ప్రత్యేక బృందం అత్యున్నత వైద్యం అందించిందని తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రీతి ప్రాణాలు కోల్పోయిందన్నారు. మా ఆసుపత్రి నిత్యం వందల మందికి ఎమర్జెన్సీ సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.


Post a Comment

Comments