ఒక ఊరిలో కాశన్న అని ఒకడు వుండేవాడు. వానికి అన్నీ అనుమానాలే.
ఒక రోజు ఏదో పనిబడి పక్క ఊరికి పోతున్నాడు. నడిచీ నడిచీ బాగా దాహం వేసింది. వెంట తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఒకచోట ఒక కొలాయి కనబడింది. తాగుదామని పోతే పక్కన ఒకామె బట్టలు ఉతుకుతూ కనబడింది.
“ఛీ... ఛీ... సబ్బు చేతులతో ఆమె కొలాయి ముట్టుకోనింటాది. ఈ సబ్బునీళ్ళు నేను చచ్చినా తాగను" అనుకుంటూ ముందుకు పోయాడు.
దారిలో ఒకచోట ఒక బోరింగు కనిపించింది. తాగుదామని దగ్గరికి పోయేసరికి ఒక ఆవు అక్కడికి వచ్చి నాలికతో దానిని నాకసాగింది.
“ఛీ... ఛీ... యాక్. ఈ ఆవు బోరింగునంతా నాకినాకి పెట్టింది. ఈ ఎంగిలినీళ్ళు నేను తాగనే తాగను" అనుకుంటూ ముందుకు నడిచాడు.
ఒకచోట ఒక బావి కనిపించింది.
బావిలో నీళ్ళు తాగుదామని దగ్గరికి పోయి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక తాబేలు నీళ్ళలో తిరుగుతూ కనబడింది. “ఛీ... ఛీ... ఈ తాబేలు నీళ్ళనంతా గలీజు చేసింటాది. ఈ నీళ్ళు నేను అస్సలు తాగను" అనుకుంటూ ముందుకు నడిచాడు.
దారిలో ఒకచోట ఒక చెరువు కనిపించింది. నీళ్ళు తాగుదామని దగ్గరికిపోతే చెరువు నిండా చేపలు తిరుగుతా కనబడ్డాయి.
“బాబోయ్... ఇన్ని చేపలా... కంపు కంపు. యాక్ ఈ నీళ్ళను సచ్చినా తాగను" అనుకుంటూ ముందుకు నడిచాడు.
కొంచెం దూరం పోయాడో లేదో వాన మొదలైంది.
“ఆహా! ఆకాశంలోంచి వచ్చే వాన చినుకులు స్వచ్ఛమైనవి. ఇవి తాగుతాను" అని తల పైకెత్తి నోరు తెరిచాడు.
సరిగ్గా అప్పుడే పైన ఎగురుతున్న కాకి ఒకటి రెట్ట వేసింది. అది చక్కగా వచ్చి కాశయ్య నోటిలో పడింది.
“ఛీ... ఛీ... యాక్... యాక్... ” అనుకుంటూ నీళ్లకోసం చుట్టూ చూశాడు. పక్కనే వానకు పారుతున్న బురదనీరు కనబడింది. ఏమీ చేయలేక వాటితోనే గబగబా నోరు కడుక్కున్నాడు.
అనుమానాల కాశయ్యకు అన్ని నీళ్ళూ పోయి చివరికి బురదనీరే గతి అయ్యింది.
Comments