Telugu Story: నిరుపేద - సంపద తెలుగు కథ



🍁నిరుపేద - సంపద🍁


ఒకరాజు ఎప్పుడూ నిరాశతో ఉండేవారు. దీంతో ఆయన ఆరోగ్యం రోజురోజూ క్షీణించసాగింది. పాలన గాడితప్పింది. రాజు కుటుంబ సభ్యులు, మంత్రులు, అధికారులు రాజుగారి ఆరోగ్యంపై ఆందోళన చెందసాగారు. 


ఆస్థాన వైద్యుణ్ని పిలిపించారు. వైద్యుడు అన్ని విధాలా పరీక్షించాడు. రాజుకు ఎలాంటి శారీరక సమస్య లేదని, నిరాశ, నిస్పృహల వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని చెబుతాడు. 


‘రాజ్యంలో ఎవరైతే సుఖసంతోషాలతో, ఆత్మసంతృప్తితో ఉంటారో.. అలాంటి వ్యక్తి చొక్కాను రాజుగారు ధరిస్తే మళ్లీ మామూలు మనిషి అవుతార’ని చెప్పాడు వైద్యుడు. అలాంటి వ్యక్తికోసం గాలించడం మొదలుపెట్టారు. 


 మంత్రికి ఓ వ్యాపారి తారసపడ్డాడు. ‘నీ వ్యాపారం ఎలా ఉంది. నువ్వు సంతృప్తిగానే ఉన్నావా?’ అని అడిగాడు మంత్రి. ‘మంత్రివర్యా! దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ధనం, గౌరవ మర్యాదలకు లోటు లేదు. కానీ, నాకు సంతానం లేదు. అదే దిగులంతా’ అని బదులిచ్చాడు. మంత్రి ముందుకు కదిలాడు. 


మరో యువకుడు ఎదురయ్యాడు. అతడిని విచారించాడు మంత్రి. ‘దైవం నాకన్నీ ఇచ్చాడు కానీ, నా ఆరోగ్యం బాగుండదు’ అని బదులిచ్చాడు. మళ్లీ ముందుకెళ్లాడు.



నిరాశతో తిరుగు ప్రయాణమైన మంత్రి.. ఓ పూరిగుడిసెలో నుంచి వస్తున్న మాటలు విని అడుగు ముందుకు వేయలేకపోయాడు. ‘ఓ అల్లాహ్‌! నీవెంత కరుణామయుడవు. నీ కృపతో నా జీవితం ఎంతో సంతృప్తికరంగా, సంతోషంగా గడుస్తోంది’ అని దైవాన్ని వేడుకుంటున్నాడు గుడిసెలోని వ్యక్తి. వెంటనే మంత్రి గుడిసెలోకి వెళ్లి ఆ వ్యక్తి ధరించిన చొక్కాను తనకివ్వమని అడిగాడు. అందుకు ప్రతిఫలంగా రాజుగారికి చెప్పి విలువైన బహుమతులు ఇప్పిస్తానన్నాడు.


 చొక్కాను తీసుకొని సంతోషంగా రాజదర్బారుకు వెళ్లాడు. చిరిగిపోయి, అతుకులతో ఉన్న ఆ చొక్కాను తీసుకువచ్చి రాజు చేతిలో పెట్టి.. జరిగినదంతా వివరించాడు. అదంతా విన్న రాజుకు కళ్లు తెరుచుకున్నాయి. 


👉‘గుడిసెలో ఉండి.. కట్టుకోవడానికి దుస్తులు కూడా సరిగ్గాలేని ఓ నిరుపేద.. దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతృప్తిగా ఉన్నాడు. సంపద, అధికారం, హోదా అన్ని అనుభవిస్తూ నేను నిరాశతో గడుపుతున్నాను’ అనుకొని లోలోన పశ్చాత్తాపం చెందాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.🍁

Post a Comment

Comments