Telugu Story: 'దయ' తెలుగు కథ



🍁దయ🍁 

మూడో తరగతి చదువుతున్న రాకేశ్‌ కల్లాకపటం తెలియని పిల్లాడు. ఒక రోజు సైకిలు ఎక్కి తిరుగుతుంటే చిన్న కోడిపిల్ల చక్రం కింద పడింది.సైకిలు ఆపి కోడిపిల్లను చేతిలోకి తీసుకున్నాడు. చక్రం కింద పడటంతో దాని ప్రాణం పోయింది. ఆ విషయం తెలియని రాకేశ్‌... పక్కనే ఉన్న డాక్టర్‌ విశ్వం ఇంటికి వెళ్లి ‘అంకుల్‌! ఈ కోడిపిల్ల నా సైకిలు చక్రం కింద పడింది. దానికి దెబ్బ తగిలినట్టుంది.  నయం చేయరా! మీకు డబ్బులు ఇస్తా’ అన్నాడు.


డాక్టర్‌ ఆ పసివాడి బాధ గమనించి ‘బాబూ! ఆ కోడిపిల్లని ఇక్కడ పడుకోపెట్టు, సాయంత్రం రా! దానికి మందు ఇచ్చి బాగు చేస్తాను’ అన్నాడు.


రాకేశ్‌ సంతోషంతో అమ్మ, నాన్న దగ్గరికి వెళ్లి తాను చేసిన పని గురించి చెప్పి ‘డాక్టర్‌ అంకుల్‌కు ఫీజు ఇవ్వాలి సాయంత్రం నేను వెళ్లేటప్పుడు ఇవ్వండి’ అని లోపలికి వెళ్లాడు.


రాకేశ్‌ అమ్మానాన్నలు.. పిల్లవాడిని మోసం చేసి ఉంటాడని డాక్టర్‌ను నిలదీయాలని కోపంగా విశ్వం దగ్గరికి వెళ్లారు.


‘చనిపోయిన కోడిపిల్లని మా వాడు తెచ్చిస్తే వాడిని మోసం చెయ్యాలనుకుంటారా? మీకు మోసం చేయడానికి మా పిల్లవాడే దొరికాడా? డబ్బుల కోసం పసిపిల్లవాడు అని కూడా చూడకుండా ఆవిధంగా చెబుతారా?’ అని ఆవేశంగా విశ్వంను తిట్టారు.


డాక్టర్‌ విశ్వం నవ్వుతూ ‘భలే ఉన్నారండీ! మీ అబ్బాయి భూతదయకు అబ్బురపడి నేను ఇంకొక కోడిపిల్లని కొని తెచ్చి మీ అబ్బాయికి ఇద్దామనుకున్నా. చనిపోయిందని చెబితే ఎలా ఫీలవుతాడో! వాడి మనసు ఎంత గాయపడుతుందో అని నేను అలా చెబితే మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. పిల్లాడికి ఉన్న మంచి మనసు మీకు లేనట్లుంది’ అన్నాడు.


డాక్టర్‌గారి మాటలను విని, రాకేశ్‌ అమ్మానాన్నలు ‘సారీ’ చెప్పి వెళ్లారు. సాయంత్రం అమ్మానాన్నలతో కలిసివచ్చిన రాకేశ్‌ ‘డాక్టర్‌ అంకుల్‌! మీ ఫీజు’ అని వంద రూపాయల నోటు ఇచ్చాడు.

డాక్టర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చిన కోడిపిల్లను రాకేశ్‌ చేతిలో పెట్టాడు.


దాన్ని చేతిలోకి తీసుకొన్న రాకేశ్‌ కిందికి వదిలాడు. ఆ కోడిపిల్ల గది అంతా తిరగసాగింది. ‘భలే భలే గాయాలు తగ్గిపోయాయి’ అని ఆనందంతో చప్పట్లుకొట్టసాగాడు.🍁

Post a Comment

Comments