వైజాగ్‌కు షిఫ్ట్ అవ్వనున్న సీఎం జగన్.. ముహూర్తం ఫిక్స్...




విశాఖ నుంచి పాల‌న‌కు సీఎం జ‌గ‌న్ సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైజాగ్‌కి మకాం మార్చబోతున్నారు ఏపీ సీఎం. అక్కడినుంచే పాలన సాగించబోతున్న సీఎం.. శ‌ని, ఆదివారాల్లో మాత్రం అమ‌రావ‌తిలో అందుబాటులో ఉంటారు. జీ-20 స‌ద‌స్సు విశాఖ‌లో జ‌ర‌గ‌నుండ‌టంతో ఆ సమావేశాలు ముగిశాక సీఎం షిఫ్ట్ అవుతున్నారు.


అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయ‌మ‌ని చెబుతున్న ఏపీ సీఎం జ‌గ‌న్.. విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఉగాది రోజున విశాఖ‌లో త‌న కార్యాల‌యం ఏర్పాటుచేయాల‌ని భావించినా కొన్ని కార‌ణాల‌తో వాయిదా ప‌డినట్లు తెలుస్తోంది. ఈనెల 14 నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభమవుతుండటంతో సీఎం బిజీగా ఉంటార‌ంటున్నాయి ప్రభుత్వ వ‌ర్గాలు.


ఉగాది రోజు విశాఖ‌లో సీఎం కార్యాల‌యం ప్రారంభించాలంటే అధికారులు అక్కడ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే అసెంబ్లీ ముగిసిన త‌ర్వాత ఏప్రిల్ మొద‌టివారంలో విశాఖకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు సీఎం జగన్‌. గ్లోబ‌ల్ ఇన్వెస్టర్స్ స‌మ్మిట్‌లో కూడా విశాఖ రాజ‌ధాని అంశాన్ని ప్రస్తావించారు సీఎం. త్వరలోనే తాను విశాఖ నుంచి పాల‌న చేస్తాన‌ని చెప్పారు. దీనికి త‌గ్గట్లుగానే సీఎం క్యాంపు కార్యాల‌యం కోసం విశాఖ‌లో ఇప్పటికే పోర్ట్ గెస్ట్ హౌస్‌ని సిద్ధం చేస్తున్నారు.


సోమ‌, మంగ‌ళ వారాల్లో విశాఖ నుంచి సీఎం పాల‌న సాగిస్తార‌ని మొద‌ట్లో చెప్పుకొచ్చారు. బుధ‌వారం ప‌ల్లె నిద్ర కార్యక్రమాంలో సీఎం సీఎం పాల్గొంటార‌న్నది ముందుగా అనుకున్న షెడ్యూల్. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మ‌రోవైపు విశాఖ‌లో జీ-20 సద‌స్సు రెండూ నెలాఖ‌రుకు ముగుస్తాయి. ఆ త‌ర్వాత ఏప్రిల్ నుంచి పాల‌న ప్రారంభించేలా సీఎంఓ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కార్యాల‌యంతో పాటు ఆయ‌న‌కు అనుబంధంగా ఉండే జీఏడీ కూడా విశాఖ త‌ర‌లివెళ్తుంద‌ని స‌మాచారం.మొత్తంగా ఏప్రిల్ నుంచి విశాఖ రాజ‌ధానిగా పాలనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది జగన్‌ ప్రభుత్వం.

Post a Comment

Comments