ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనబడే
ఉప్పుడుపిండి కధ ..
ఏంటో ఉన్నట్టుండి వెంకట్రావుకి ఉప్పుడు పిండి తినాలనిపించింది..భార్య దగ్గర కోరిక వ్యక్తం చేశాడు.." కమలా ! ఇవాళ ఉప్పుపిండి తినాలనుందోయ్! చేస్తావేంటి?" అన్నాడు గోముగా ఎక్కడ కయ్యిఁమంటుందో అని భయపడుతూ ..
అయ్యో మానవా ఇదేం కోరిక ? అని మనసులో అనుకుని " మన ఊళ్ళో ఏ శనివారమో టిఫిన్ ఏం చెయ్యాలో తోచకపోతే ఉప్పుపిండి చేస్తానండి అంటే తెయ్యిమని గెంతేవారు..ఇప్పుడేంటి ఈ చూలింత కోరిక? కోడలికేమో అలవాటు లేదు ఇలాంటివి చెయ్యడం ..ఈ బెంగుళూరు మహానగరంలో ఎక్కడి వెతుకుతాం నూకకోసం ..మనకా ఊరు తెలీదు..ప్రసాదునడిగితే విసుక్కుంటాడో ఏవిఁటో ? "
అత్తా,మామల సంభాషణ వంటింట్లోంచి వింటూ నవ్వుకుని స్వాతి "అత్తయ్యగారూ! నా దగ్గర బియ్యం నూక ఉంది ట్రై చేద్దామా?
"బతికించావ్ తల్లీ ..చేసి చూద్దాం ..ఎలా వస్తుందో"
కొంగు బిగించి ఆ ప్రయత్నంలో పడింది కమల ..తీరా చేస్తే అది గాలిపటాలు అంటించుకునే జిగురులా తయారైంది..
"అయ్యో స్వాతి ! ఇది కొత్త బియ్యపు నూకేమో ? ముద్దైపోయింది ఇది కాస్తా "
" మరి మామయ్య గారి కోరిక తీరేదెలా ? ప్రసాదుతో చెప్తానుండండి మనం వాడుకొనే బియ్యం మర పట్టిస్తే బాగా వస్తుందేమో.."
బాత్రూం లోంచి తల తుడుచుకొని వస్తూ " ఏంటో అత్తా కోడళ్ళ డిస్కషన్ ?
" ప్రసాద్! బియ్యం ఇస్తాను..కాస్త నూక ఆడించుకొస్తావా ? మామయ్య గారికి ఉప్పుపిండి తినాలనుందిట .."
" ఎప్పుడూ లేంది నాన్నకిదేం కోరిక? ఐనా ఇదేవఁన్నా మన నర్సీపట్నవాఁ ఇలా వెళ్లి అలా వచ్చెయ్యడానికి ? ఈ మహా నగరంలో ఎక్కడని
వెతకను? "
" ఉండు మన సరస్వతమ్మనడుగుతాను .. ఈ ఊరు మనిషేగా ..తనకామాత్రం తెలియకపోదు.."
కనుక్కొచ్చి అడ్రస్ చెప్పింది స్వాతి ప్రసాద్ కి ..
అబ్బ ! అసలీవేళ బ్రేక్ ఫాస్ట్ చేసి సోఫాలో తన్నిపెట్టి కూర్చుని విరాటపర్వం సినిమా చూద్దామని ప్లాన్ చేసుకున్నాడు పాపం పెళ్ళైన ప్రసాద్ .. పెళ్ళైనంత సేపు పట్టలేదు పెళ్లాం తనమీద పెత్తనం
చలాయించడానికి ..
బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ లేచాడు తప్పదురా భగవంతుడా అనుకుంటూ " ఉండరా ! నేనూ వస్తానూ ..నూక పదునుగా ఆడకపోతే పిండి బాగారాదు.. నీకసలే తెలీదూ " కమల బయలుదేరింది కొడుకు వెనకాల ..
ఎలాగో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లి రవ్వ ఎలా ఆడాలో చెప్పి దగ్గరుండి ఆడించింది ..ఇంటికొచ్చి నూక జల్లించి ఎక్కడో వెయ్యి ఇరుకుల్లో ఉన్న ఇత్తడి గిన్ని కోడలు చేత తీయించి ఉప్పుపిండి చేసింది ..ఆ కమ్మరి పోపువాసనకి ప్రసాదుకీ, స్వాతికీ నోట్లో నీళ్ళూరాయ్. .
రాత్రికి ఆర్డరిద్దామనుకున్న పిజ్జాకి బైబై చెప్పి కమల ఊర్నించి తెచ్చిన కొత్తవకాయ , నువ్వు నూనె వేసుకుని ఓ పట్టుపట్టారందరూ వెంకట్రావు తో సహా ..
" అదర్రా ! ఎలాఅయినా మన పాత వంటలే వంటలూ " తృప్తిగా అంటూ లేచాడు. .
కమల మనసులో నవ్వుకుంది బాల్య చాపల్యం అని అందుకే అంటారేమో అని ....
Comments