జాతీయ పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.. సుప్రీంకోర్టులో పిటిషన్
పెళ్లైన మగవారూ గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి వారి రక్షణకు మహిళా కమిషన్ మాదిరిగా జాతీయ పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
2021 జాతీయ నేర గణాంక నివేదిక ప్రకారం దేశంలో 1,64,033 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇందులో 81,063 మంది పెళ్లైన పురుషులు, 28,680 మంది పెళ్లైన మహిళలు ఉన్నారని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ తెలిపారు.
కుటుంబ సమస్యల కారణంగా 33.2శాతం మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 4.8 శాతం మంది వివాహ సంబంధ కారణాలతో ఆత్యహత్యలకు పాల్పడ్డారని వివరించారు. 2021లో మొత్తం ఆత్మహత్యల్లో 1,18,979 (72శాతం) మంది పురుషులని, 45,026 మంది (27శాతం) మహిళలని తెలిపారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments