మహాభారతము లోని కథ:
వేదప్రవర్తకుడైన పైలమహర్షికి ఉదంకుడను ఉత్తమ శిష్యుడుండెడివాడు. అతడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సంపన్నుడు. గురుదేవతా అనుగ్రహం వలన అణిమాద్యష్టసిద్ధులు జ్ఞానము పొందిన మహానుభావుడు ఉదంకుడు.
ఒకరోజు గురుపత్ని అతనికి ఒకకార్యమును అప్పచెప్పినది “నాయనా! మనదేశ మహారాజైన పౌష్యుడు ధర్మాత్ముడు. ఆయన ధర్మపత్ని ఉత్తమురాలు. ఒక వ్రతము చేయటానికి నాకు ఆ సాధ్వి కుండలాలు కావాలి. ఆమెను అర్థించి అవి తీసుకొనిరా”. గురుపత్ని ఆజ్ఞను శిరసావహించుటకై ఉదంకుడు వెంటనే ధర్మాత్ముడైన పౌష్యమహారాజు వద్దకు బయలుదేరినాడు. దారిలో అరణ్యమార్గములో వెళుతుండగా ఒక మహావృషభము మీదనున్న దివ్యపురుషుని చూచినాడు. అతడు సూర్యుని వలె వెలిగిపోతున్నాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునికి అనుగ్రహముతో పవిత్రమైన గోమయమును ఆరగించుటకు ఇచ్చెను. అమృతప్రాయమైన గోయమును భుజించి గురుపత్ని ఆజ్ఞ త్వరగా నెరవేర్చుటకై ఆ మహాపురుషుని వద్ద సెలవు తీసుకొని పౌష్యుని రాజ్యమును చేరుకున్నాడు.
పౌష్యుడు ఉదంకునికి యథావిధి సత్కారాలు చేసి రాకకు కారణమేమియో తెలుపుమని ఉదంకుని ప్రార్థించినాడు. ఉదంకుడు తన గురుపత్నిగారి ఆజ్ఞను రాజుకు తెలిపినాడు. “ఆహా! లోకశ్రయస్సును కోరే మీవంటి తాపసులను సేవించుటకంటే అదృష్టమేమున్నది? మహానుభావా నా రాణి వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పి కుండలములను తీసుకొనుము” అని పౌష్యుడు చెప్పినాడు. వెంటనే ఉదంకుడు మహారాణిగారి మందిరమును చేరుకున్నాడు. కానీ ఆయనకు ఎక్కడా పౌష్యరాణి కనబడలేదు! తరిగివచ్చి “రాజా! నాకు మహారాణి కనబడలేదు. నీవే ఆ కుండలములను తెప్పించి ఇవ్వు” అని అడిగినాడు.
అప్పుడు పౌష్యమహారాజు ఇలా అన్నాడు “భూవినుత! నీవంటి త్రిభువన పావనుని అశుచివి అని ఎట్లా అనగలను? నా రాణి మహాపతివ్రత కావున అశుచులకు కనబడదు”. ఉదంకుడు ఎందులకు తనకు అశుచి వచ్చినదో ఆలోచించినాడు. తాను గురుపత్నీ కార్యమును త్వరగా పూర్తిచేసే తొందరలో ఆ మహాపురుషుడు ఇచ్చిన గోమయాన్ని భుజించిన తరువాత ఆచమించలేదని గుర్తుకు వచ్చినది. వెంటనే కాళ్ళూ చేతులు అన్ని కడుక్కుని కేశవ నామాదులతో ఆచమనము చేసి శిచియై మహారాణి అంతఃపురమునకు వెళ్ళినాడు. అక్కడ యథాస్థానములో మహారాణిని చూసి ఆమె పాతివ్రత్య మహాత్మ్యమునకు ఆశ్చర్యపోయి “మహారాణీ! మా గురుపత్ని వ్రతార్థము మీ కుండలములు కోరి వచ్చినాను” అని ప్రార్థించినాడు. ఆ పతివ్రతామతల్లి తన కుండలములు ఇట్టి తాపసులకు ఉపకరిస్తున్నాయని సంతోషించి ఉదంకునకు కుండములను ఇచ్చి పంపింది.
ఈ కథలోని నీతి:
శుచిత్వము సత్పురుషుల సందర్శనమునకు ప్రథమ సోపానము. ఉదంకుడు భోజనము తరువాత తొందరలో ఉండి కాళ్ళుకడుక్కుని ఆచమించనందున ఎంతగొప్పవాడైనా ఆయనకు పతివ్రత అయిన పౌష్యరాణి కనబడలేదు. కావున మనమన్ని వేళలా ముఖ్యముగా సత్పురుష, దైవ సందర్శనమునకు వెళ్ళునప్పుడు శుచిగా ఉండవలయును. ఇదే కారణముగా అర్జునుడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగమునకు ముందు శుచులై మంత్రప్రయోగము చేసినారు. బకాసురుని యుద్ధమునకు ముందు భీమసేనుడు ఆహారము భుజించి శుచిఅయ్యి తరువాతనే యుద్ధము చేసేడు.
Comments