నేను మొదటిసారి సిగరెట్ తాగింది ఐదులోనో ఆరులోనో అనుకుంటా. నేనూ మాన్నా ఒకరోజు మద్యాన్నం స్కూలిడ్చగానే సంచీలు తగిలిచ్చుకోని ఎన్నార్ పేటలోని సిండికేట్ బ్యాంకు సందులో నడుస్తా వుంటే ఎవడో తాగి పాడేసిన పీక అరతా వెలుగుతా కమాన్... కమాన్... అంటా ఆహ్వానించింది. సినిమాల్లో హీరోలంతా రెండు గుండీలిప్పేసి స్టయిల్‌గా గాల్లోకి పొగ వూదుతా వుంటే చూసీ చూసీ మాకు గూడా ఒకసారి పీల్చి చూడాలని బలే కోరిగ్గా వుండేది. అట్లా యిట్లా చూసినాం. సందు ఆ చివర నుండి ఈ చివర వరకూ ఒక్కడు గూడా కనబల్లేదు.
మా అన్న సిగరెట్టెత్తుకోని బెరబెరా ఒక దమ్ము పీకి నాకిచ్చేసినాడు. నేను గూడా క్షణం ఆలస్యం చేయకుండా ఒక పీకు పీకినా. ఆట్లా పీకడమాలస్యం పొగ వూపిరి తిత్తుల్లోనికి పోయి ఇద్దరమూ ప్రేమాభిషేకంలో ఏఎన్నార్ లెక్క ఖల్ ఖల్ మని దగ్గడం దగ్గడం కాదు. ఇందులో అంత ఆనందమేముందిరా భగవంతుడా అనుకుంటా దాన్ని ఇసిరి పాడేసినాం.
మా అన్న నాకు తెలిసి ఈ రోజు వరకూ మల్లా సిగరెట్ జోలికి పోలేదు గానీ నేను ఇంటర్లోకొచ్చేసరికే అది నా చేతి వేళ్ళ మధ్యకొచ్చేసింది. మా డ్రిల్లుసారు కొడుకు రమణమూర్తీ, నేనూ నేతాజీ టాకీస్ దాటి పంప్‌హౌస్ దగ్గరికి పోయేటోళ్ళం. మూర్తి ఖరీదైన మోర్ సిగరెట్లు తెచ్చేటోడు. అవి పొడుగ్గా... సన్నగా... నశం రంగులో... తాగితే గొంతంతా చల్లగా... స్మూత్‌గా... రెండు వేళ్ళ మధ్య స్టయిలుగా వుండేవి. అంతవరకూ సిగరెట్ తాగడమంటే వుప్ఫు వుప్ఫుమని పొగపీల్చడం, వదలడం మాత్రమే అనుకునే నాకు, దాన్ని గుండెల వరకూ నెమ్మదిగా ఎట్లా పీల్చాల్నో... ఎట్లా వదలాల్నో మూర్తే నేర్పిచ్చినాడు. అట్లా తాగతావుంటే ఒళ్ళంతా జివ్వుమనేది. కాస్త తూగి నట్టుండేది. దాంతో సరదాగా వూరి బైటకి పోయి ఒకొక్క సిగరెట్టూ అప్పుడప్పుడూ కాల్చడం మొదలైంది.
రజనీకాంత్ లెక్క సర్... సర్... సర్ మని ఎగరేసెగరేసి పట్టుకోడం, కొంతమంది లెక్క స్టయిల్‌గా రింగులు రింగులు వదలడం ప్రాక్టీస్ చేసేటోన్ని. శ్రీశ్రీ సిగరెట్టు తాగే బొమ్మను ఆరాధనగా చూసేటోన్ని. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆ తర్వాత్తర్వాత అది రోజుకో సిగరెట్టై, ఆపై పూటకొకటై, మరి కొన్నాళ్ళకు గంటకొకటై, కుక్క తోకనూపడం మానేసి తోకే కుక్క నూపినట్టు నన్నాడించే స్థితికొచ్చేసింది. మధ్యలో అప్పుడప్పుడూ మానేసినా అది అయ్యప్ప సాముల మాదిరి పదీ ఇరవై రోజులే.
చిన్నగున్నప్పుడు పుస్తకాలు చదివీ చదివీ నేను గూడా కతలూ కవితలూ రాయాలని ఎంత ప్రయత్నించినా రాయలేకపోయేటోన్ని. మందు తాగనోడు రచయిత కాలేడు అనేటోళ్ళు అప్పట్లో చానా మంది. ''రేయ్... రచయిత గావాలంటే మందూ సిగరెట్ వుండాలంటరా.. అప్పుడయిడియాలు కుప్పలు కుప్పలుగా ఒస్తాయంట. నేను గూడా పెద్దగయినాక బాగా సంపాదిచ్చుకోని అవన్నీ అవన్నీ కొనుక్కోని తాగుతా తూగుతా కతల మీద కతలు రాస్తా చూస్తుండు'' అని రాబర్ట్‌గానికి అప్పట్లో తెగచెప్పేటోన్ని.
మొట్టమొదటిసారి మందురుచి చూసింది గూడా ఈ ఇంటర్ వయసులోనే. ''అమృతం... అమృతం లెక్కుంటాది. ఒక్కసారి రుచి చూస్తే మల్లా జన్మలో వదల్లేమం''టా వుంటారు గదా ఆ రుచేందో చూద్దామని మనసు లాగేస్తా వుంటే ఒకసారి స్నేహితుల్తో కల్సి నోట్లో కాస్త బీరు పోసుకున్నా. నోరంతా గబ్బు గబ్బు. యాపాకు తిన్నట్టు. యాక్ యాక్ అంటా గబగబా బూందీ నోట్లో ఏసుకోని కసకసకస నముల్తే గానీ ఆ రుచి పోలా - ''ఇదేం రుచిరా నాయనా'' అంటా మొగం ఇకారంగా పెడ్తే ''ఒరే... తిక్కోడా... హాలాహలం తర్వాతనే గదరా అమృతం పుట్టేది. తాగేటప్పుడు కాదు మజా... తాగినాక'' అంటూ మూర్తి మరో గ్లాసు తాపినాడు. కాసేపటికి మత్తు మత్తుగా గమ్మత్తుగా భలేగన్పించింది తమాష తమాషగా.
ఒకరోజు మా అన్న తిరుపతి నుండి కర్నూలు కొచ్చినాడు. ఆరోజే మా అమ్మ మా అక్కను చూడ్డానికని హైదరాబాదుకి పోయింది. ఇంట్లో నేనూ మాన్నే. మా అన్న రాత్రి ''రేయ్... వెరైటీ టాకీసు కాడుండే మధువన్‌లో మటనయిటమ్స్ చానా బాగుంటాయంట గదా... పోయి తినొద్దామా'' అన్నాడు. సరేనన్నా. అది బార్ అండ్ రెస్టారెంట్. విందేగాదు మందు గూడా దొరుకుతాది. కొంతమంది తాగుతా తూగుతా తింటా వున్నారు. వాళ్ళను చూస్తావుంటే నాక్కూడా నాలుక జివ్వుమనింది. దాంతో ''నా... తాగుదామా'' అన్నా. మాన్న ''నాకలవాటు లేదురా... నీకు'' అన్నాడు. 'ఆ ఫుల్లు'' అన్నా నేను లెవల్‌గా. ''సరే... ఐతే నువ్ తెప్పిచ్చుకో... నాకొద్దు'' అన్నాడు.
ఏమి తెప్పిచ్చుకోవాల్నో నాకు తెలిసేడిస్తే గదా... మా స్నేహితుల్లో కొందరు ''రేయ్... ఓల్డ్‌మంక్ రమ్ము మస్తుగుంటాదిరా'' అంటా వుంటారు అప్పుడప్పుడు. అది గుర్తుకొచ్చి ''ఓల్డ్‌మంక్ రమ్... ఒన్ క్వార్టర్'' అని ఆర్డరిచ్చేసినా స్టయిల్‌గా. మాన్న రకరకాల వంటలు ఆర్డరిచ్చేసినాడు. వాడు ముందు క్వార్టర్ బాటిల్ తెచ్చి నా ముందు పెట్టినాడు. అంతవరకూ నేను కూలే తప్ప హాటు తాగింది లేదెప్పుడూ. దానికీ దీనికీ నక్కకూ నాగలోకానికీ వున్నంత తేడా వుంటాదని నాకేం తెల్సు. దాంతో బీరు మాదిరే గ్లాసులోకి పోసుకొని ఒక్కదెబ్బకే మొత్తం హాంఫట్ అనిపించినా. అంతే గొంతు భగ్గుమనింది.
ఇదేందిరా నాయనా... ఇట్లా వుందని అనుకుంటా వుండగానే కాసేపటికే తల గిర్రున తిరగడం మొదలుపెట్టింది. మా సోషల్ సారు భూమి బొంగరం లెక్క గిర్రున తిరుగుతా వుంటాదని చెబ్తా వుంటే నమ్మకుంటుంటి గానీ అది నిజమే అని అప్పుడర్థమైంది. టేబుల్ మీదికి మాన్న ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసినాయి. తిందామని చేయి చాప్తే అది లేస్తే గదా... అంతా తిక్కతిక్కగా వుంది. కడుపులో అగ్ని పర్వతం లెక్క గుడగుడమంటా వుంది. అంతలో లోపలున్నదంతా ఒక్కసారిగా సునామీలా దూసుకోని బైటికొచ్చేసింది. అట్లాగే పడిపోయినా.
మాన్న ఎట్లా లేపుకొచ్చినాడో ఏమోగానీ రిక్షాలో ఏసుకోనొచ్చి ఇంట్లో పాడేసినాడు. మళ్ళా తర్వాత రోజు పొద్దున కండ్లు తెరిచినా. ''చాతగాకపోతే... చాతగానోని లెక్క మట్టసంగా పడుండొచ్చు గదా... అంతా వేస్టు చేసినావు. ఎక్కడివక్కడ వదిలేసి బిల్లు కట్టి రావాల్సొచ్చింది... నీమూలంగా'' అంటూ కేకలేసినాడు.
దీని సంగతేందో తెల్సుకోవాలని హాటు ఎట్లా తాగాల్నో స్నేహితుల ద్వారా తెల్సుకోని నెమ్మదిగా అలవాటు చేసుకున్నా. నెలకో రెన్నెల్లకో ఒకసారి పార్టీ చేసుకుంటా వుండేటోళ్ళం. ఇది బాగా డబ్బుల్తో కూడుకున్న యవ్వారం గాబట్టి, చేతిలో అంత డబ్బులు ఆడడం కష్టం కాబట్టి పూర్తిగా అలవాటు కాలేదు. కానీ ఎవడన్నా వస్తావా... అని పిల్చడమాలస్యం ఎగిరి వాని సంకలో కూచునేటోన్ని. హైదరాబాదుకి పోయినప్పుడల్లా డిఫెన్సు కాలనీలో వుండే మా శివయ్య బాబాయి కొడుకు శేఖర్ గాన్నడిగి ఏదో ఒక చోట తక్కువ రేటుకి మిల్ట్రీరమ్ము సంపాదించుకోనొచ్చి, స్నేహితుల్తో కర్నూల్లో ఎంజాయ్ చేసేటోన్ని. ఒక్కన్ని మాత్రం ఎప్పుడూ తాగలా.
డిగ్రీలో మా రాబర్ట్‌గాని కోసం హనుమాన్ చౌరస్తాలో లారీ బ్రోకర్ ఆఫీసుకాడికి పోయేటోన్ని. వాడు ఇంటర్ సగంలోనే ''నేను చదవలేను నాయనా ఈ చదువు'' అంటూ చేతులెత్తేసి దాంట్లోకి చేరిపోయినాడు. అక్కడ చానా మంది జర్దా పాన్ ఏసుకునేటోళ్ళు. అప్పటి వయసెట్లాంటిదంటే ప్రతిదాన్నీ రుచి చూడాలనిపిస్తా వుండేది. దాంతో చూద్దాం దీని సంగతేందో అనుకోని నేనూ నమిలి బుగ్గనెట్టుకున్నా. నోరంతా జివ్వుజివ్వుమంటా... కాస్త కైపుగా... సరదాగా అనిపించింది. దాంతో నెమ్మదిగా అది గూడా అలవాటైపోయింది.
కానీ ఇవన్నీ వూకేం రావు గదా... చేతిలో పైసలాడక తెగ ఇబ్బంది పడేటోన్ని. నోట్సులకని, గైడ్లకని, టర్మ్ ఫీజులకని ఇంట్లో ఎక్కువెక్కువ చెప్పి తెచ్చుకునేటోన్ని. ఇంగ్లీషు ప్రయివేటు పోతున్నా అని చెప్పి పోకున్నా నెలనెలా ఠంచనుగా ఫీజు ఇప్పించుకునేటోన్ని. అమ్మ ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా పర్సులో చిల్లర మాయం చేసేటోన్ని. ఐనా సమయానికి డబ్బులాడక రెండు మూడు బంకులల్లో ఖాతాలు తెరిచి వున్నప్పుుడిచ్చేటోన్ని.
డిగ్రీ పరీచ్చలు దగ్గర పడ్తా వున్నప్పుడు మా బుజ్జోడు జర్దాపానును ఆనందంగా నముల్తా నముల్తా ''రేయ్... ఇది అలవాటయితే మానేయలేమురా... మతిమరుపొచ్చేస్తాది.. నోట్లో లేకుంటే ఎంత కిందా మీదా పన్నా ఏమీ గుర్తుకు రావు'' అని చెప్పినాడొకసారి. నాకెందుకో కాస్త భయమేసింది. అదే సమయంలో ఏం దీనికంత పవరుందా చూద్దామనుకోని సరిగ్గా పరీచ్చలకి ముందురోజు మానేసినా. మర్లా ఇంతవరకూ ముట్టుకుంటే ఒట్టు. అట్లా ఒక అలవాటులోంచి బైటికొచ్చేసినా.
మందు కొట్టేది అప్పుడప్పుడే అయినా నాలుక దాని కోసం జివ్వు జివ్వుమని పీక్తా వుండేది. ఒకసారి హైదరాబాదు నుండి మిల్ట్రీరమ్ము తెచ్చినా. మా అమ్మ వూరికి పోయినప్పుడు మా బుజ్జిగాన్తో కల్సి బాటిల్ ముందు పెట్టుకోని తాగుతా తాగుతా మధ్యలో గుడ్లకూర పెట్టుకోని తింటా దాదాపు ముక్కాలు దాకా లేపేసినాం.
అప్పట్లో నేను మనిషి పుట్టుక పుట్టినాక ఏదో ఒక మంచిపని చేయాల గదా అని అచ్చరజోతిలో వాలంటీర్‌గా పనిచేస్తుంటి. వానొచ్చినా వరదొచ్చినా ఒక్కపూట గూడా ఎగ్గొట్టకుండా సదువు నేర్పడానికి పోతా వుంటి. దాంతో వాళ్ళు గూడా ప్రతిరోజూ నా కోసం టయానికి ఎదురు చూసేటోళ్ళు.
ఇక్కడ మేమిట్లా పొద్దున్నే దుకాణం పెట్టినాం గదా... మధ్యాన్నానికి బుజ్జిగాడు ''ఇంగ నాతో గాదురా... పోయొస్తా'' అని చెప్పెల్లి పోయినాడు. నేను గూడా మంచమ్మీద అట్లాగే వాలిపోయినా. మల్లా కండ్లు తెరచి చూసేసరికి మసక మసక చీకటి పడ్తా వుంది. తలంతా దిమ్ముగా వుంది. అంతలో అచ్చరజ్యోతి గుర్తుకొచ్చి బెరబెరా మొగం కడుక్కోని సైకిలేసుకోని పోయి ఎప్పట్లాగే పాఠాలు చెప్తున్నా...
ఒక పాప... పదేండ్లుంటాయి. నా పక్కకొచ్చి నిలబడి పలక పైన అచ్చరాలు దిద్దిస్తావుంటే చూస్తా... చూస్తా... ''సార్... నువ్వు తాగొచ్చినావు గదా'' అనడిగింది హటాత్తుగా వాసన గుర్తుబట్టి. ఆ పాప కండ్లు అది నమ్మలేనట్టున్నాయి. ఏం చెప్పాల్నో అర్థం గాక మాటల కోసం బుడుక్కుంటా వుంటే ఆ పాప మల్లా ''నువ్వే గద్సార్... తాగడం మంచోళ్ళు చేసే పని గాదని చెప్పింది'' అనింది. ఆ మాటింటూనే నా మొగమ్మీద ఎగిచ్చెగిచ్చి తన్నినట్లయింది. అప్పటికప్పుడు ఆ పాపకేదో చెప్పినాగానీ ఆ మాటలు కొంత కాలం పాటు వెంటాన్నాయి. ఆ తర్వాత నేను కనీసం మూడు సమ్మచ్చరాల దాకా మందు వంక అస్సలు కన్నెత్తి గూడా చూల్లేదు. ఆ తర్వాత అప్పుడప్పుడూ ముట్టుకున్నా అదీ బీరు మాత్రమే. ఇంతకు ముందులెక్క అదిప్పుడు కవ్వించడంలా. ఎదుటోడు తాగుతావున్నా ఏ చికెన్ ముక్కో నములుకుంటా గమ్మున కూచోగలుగుతున్నా.
ఇంక మిగిలింది సిగరెట్టు. ఇదే నా మొదటి ఫ్రెండు. ఎన్ని సార్లు వదిలించు కుందామన్నా వదల్లేదు ఫెవికాల్లెక్క. నాకుండే ఒంటరితనానికి ఇదే తోడు. అదీ గాక సిగరెట్టు మీద సిగరెట్టంటిస్తా వుంటే వూహలు సుడులు తిరుగుతా కతలు మరింత బాగా రాయొచ్చనే నమ్మకమొకటి. దానికి తోడు ఎప్పుడూ ఏదో ఒక బాధ. ఆందోళన. ఇవి తీరితే మానేయొచ్చనుకుంటావుంటి గానీ ఇవి ఏదో ఒకనాటితో తీరేవిగావని, చచ్చేదాకా సముద్రమలల్లెక్క నిరంతరం ఒకదానెంబడొకటి వస్తానే వుంటాయని అర్థం చేసుకోలా.
మా అమ్మకి మందు పానుల గురించి తెలీదుగానీ సిగరెట్టు తాగతా వున్నేది మాత్రం తెల్సు. నేను ఎక్కడ పడితే అక్కడ ఏ మాత్రం భయం లేకుండా సిగరెట్టు మీద సిగరెట్టు వూదుతా వుంటే మాకు తెలిసినోళ్ళు చూసి మా అమ్మ చెవిలో వూదేటోళ్ళు.
ఎక్కడ నా ఆరోగ్యం పాడైతాదో ఏమో అని మా అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది. ఎన్ని మాటలన్నా నేను గమ్మునుండేటోన్ని. లేదా సర సర సర బైటికెల్లిపోయేటోన్ని. అంతేగానీ పట్టించుకొనేటోన్ని గాదు. మానేసేటోన్నీ గాదు. ఎన్నిసార్లు గొడవ పన్నా లాభం లేకపోవడంతో వీనికి చెప్పినా ఒకటే... ఆగోడకు చెప్పినా ఒకటే అనుకోని మా అమ్మ దాని గురించి మాట్లాడడమే మానుకుంది.
ఆ తర్వాత నేను ఇంకా పెద్దోన్నయి పెండ్లి చేసుకున్నాక చాటు మాటుగా నా పెండ్లాంతో చెప్పేది ఎట్లాగయినా మానేసేలా చూడమని. కానీ అమ్మ మాటే వినని నేను పెండ్లాం మాట ఏం వింటాను.
మా తాత ఎప్పుడూ బీడీ తాగుతా వుండేటోడు. అట్లాంటిది ఒకసారి కర్నూలొచ్చినపుడు బీడీ ముట్టుకోలేదు. నేనాచ్చర్యపోయి ''ఏంది తాతా... బీడీ తాగడం లేదు. డాక్టరొద్దన్నాడా'' అని అడిగినా. దానికి మా తాత బోసి నోటితో నవ్వి ''అదేం లేదురా... ఏముందిందులో... ఏమీ లేదు. అందుకే మానేసినా'' అన్నాడు. ఆ తర్వాత మాతాత తాగడం ఆయన బతికుండగా నేనెప్పుడూ చూల్లేదు. డెబ్బై ఏండ్ల ముసిలోనికే చాతనయితే నాకు కాదా అనుకునేటోన్ని.
నేనుండేది టీచరు వృత్తిలో. మా స్కూల్లో నేను తప్ప ఎవరూ తాగరు. పిల్లల ముందు తాగడానికిష్టం లేక స్కూలు వెనుక ఎండకు నిలబడి తాగతా వుంటే ''ఏందిది దొంగచాటుగా... ఇంత బతుకూ బతికి'' అనిపించేది. అదీగాక చెప్పే వృత్తిలో వున్నా. ప్రవృత్తి కూడా అదే. పది మందికీ నీతులు చెప్పే నేను... జీవితంలో పాటించగలుగుతున్నానా అని అనుమానమొచ్చేది. ఇది నెమ్మదిగా పెను భూతమై నా పీకమీద కూచోనింది. దానికి తోడు అసలు నా మీద నాకు కంట్రోలుందా లేదా అనే పెద్ద డౌటొకటి.
మానేయడానికి రేపు ఎల్లుండి అని ముహుర్తాలు పెట్టుకుంటా... పెట్టుకుంటా... ఒకొక్క నెలా దాట్తా వున్నా. ఇట్లయితే లాభం లేదనుకోని నా మీద నాకే కోపం వచ్చేసి ఒకరోజు సిగరెట్టు మీద సిగరెట్టు గబగబా పీకి ఇదే ఆఖర్రోజు అని నిశ్చయించేసుకున్నా. మర్లా వారానికి ఒక సిగరెట్. మర్లా వారానికి మరొకటి. అంతే... ఆ తర్వాత దాని జోలికి పోలా... గత నాలుగు సమచ్చరాల నుంచీ.....
ఇట్లా ఎంత కాలముంటానో తెలీదు గదా... అందుకే మా అమ్మకింత వరకూ నేను సిగరెట్టు మానేసింది చెప్పలేదు. కానీ ఈ కత చదివినాక విషయం తెల్సిపోయి మా అమ్మ ఎంత సంబరపడతాదో... ఏమో...
*********
Comments