IRCTC Down: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌...నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోస్టులు

IRCTC Down: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌ సమయంలో ఐఆర్‌సీటీసీ యూజర్లకు చుక్కలు చూపించింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోస్టులు పెట్టారు.

భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC)లో శనివారం ఉదయం అంతరాయం తలెత్తింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ సమయంలో వెబ్‌సైట్‌, యాప్‌ మొరాయించింది. దీంతో పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. తమకు కలిగిన అసౌకర్యానికి గానూ మండిపడుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో ఉదయం 10 గంటల నుంచి అంతరాయం తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ సైతం తెలిపింది.

ఉదయం 10 గంటలకు ఏసీ తరగతులకు (1AC, 2AC, 3 AC, 3E), 11 గంటలకు నాన్‌ ఏసీ తరగతులకు తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌కు ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పిస్తోంది. అయితే, ఆయా సమయాల్లో టికెట్‌ బుక్‌ చేద్దామని ప్రయత్నించిన చాలా మంది.. లాగిన్‌ విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు తెలిపారు. బుకింగ్‌ సమయంలో అమౌంట్‌ మొత్తం డిడక్ట్‌ అయినా టికెట్‌ మాత్రం బుక్‌ అవ్వలేదని కొందరు యూజర్లు పేర్కొన్నారు. మరికొందరు తమకు చూపించిన ఎర్రర్‌ మెసేజ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతానికి మాత్రం వెబ్‌సైట్‌ యథాతథంగా పనిచేస్తోంది.

Post a Comment

Comments