Moral Story: నమ్మిన వాళ్ళకే కాకుండా సొంతవాళ్ళకూ దూరమౌతామని గ్రహించిన నక్క

 నక్క కథ

ఒక అడవిలో ఒక నక్క తన పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది. అది పిల్లల సంరక్షణ కోసం ఎక్కువ సమయం గడుపుతూ ఆహారం కోసం దగ్గర్లోనే వెతికి ఏది దొరికితే అది పట్టుకొచ్చి పిల్లలకు పెట్టి తాను మిగిలింది తినేది. దానివల్ల కొన్ని రోజులకు సరిపడినంత ఆహారం తీసుకోనందున చిక్కి శల్యమైపోయింది.


అదే సమయంలో ఒక పెద్దపులి జింకను వేటాడి తిన్నంత తిని మిగిలింది గుహలో వదిలి తన పిల్లలతో వాహ్యాళిగా తిరుగుతుంటే చిక్కిన నక్క కనిపించింది. దాన్ని చూసిన పులి తన పిల్లలకు సులభంగా వేటాడ్డం నేర్పవచ్చని భావించి నక్క ముందుకెళ్ళి నిలబడింది. పులిని చూసిన నక్కకు పైప్రాణాలు పైనేపోయాయి. అయినా వణికే గింతుతో తనకూ చిన్న పిల్లలున్నారని, విడిచిపెట్టమని వేడుకుంది. ‘నిన్ను విడిచి పెడితే నా పిల్లలు వేటాడటం ఎలా నేర్చుకుంటాయి?‘ అని ఎదురు ప్రశ్నించింది పులి. ‘నన్నైతే ఒక్కసారే వేటాడగలవు. నన్ను విడిచిపెడితే లేడి, కుందేలు, దుప్పి వంటి జీవాల ఉనికి తెలిపి సహకరిస్తాను‘ అని ప్రాధేయపడింది.


పులికి కూడా పెద్దగా ఆకలి లేకపోవటంతో సర్లే ఎంతమాత్రం నిజాయితీ వుందో చూద్దాం నన్ను కాదని ఎంతకాలం తప్పించుకోగలదు? అనుకుని విడిచిపెట్టింది.


ఆరోజునుంచీ నక్క తనను, తనపిల్లలను పులిబారి నుంచి కాపాడుకోవటానికి పొదలచాటున నక్కి, వన్యమృగాల కదలికలు తెలుసుకుని పులికి చేరవేసేది. అది వేటాడగా మిగిలింది నక్క, దాని పిల్లలు ఆరగించి త్వరలోనే బాగా బలిసి హాయిగా ధైర్యంగా తిరగసాగాయి.


ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకటంతో అడవిలోని ప్రాణులే కాక మనుషులు కూడా అదను చూసి ఒకరి విషయాలు ఒకరికి చేరవేసే వాళ్ళను, మంచితనం నటించి సమయం వచ్చినపుడు చెడుగుణం బయటపెట్టే వాళ్ళను ’జిత్తులమారి నక్క’ అని పిలవటం పరిపాటి అయ్యింది. అయితే తన మాట విన్నట్టే పులి ఇతరుల మాట కూడా వింటే రేపు తనకూ హాని కలగ వచ్చన్న విషయం గుర్తించలేకపోయింది.


అదే అడవిలో తెలివైన ఎలుక ఒకటి నక్క సంగతి కనిపెట్టి పులితో ‘నక్క ఈ మధ్య సింహానికి వేటలో సహకరిస్తోందని, అందుకే పులికి సరిగా చెప్పకుండా దాటవేస్తోందని’ పులికి అనుమానం కలిగేలా చెప్పింది. ఒకరోజు బాగా ఆకలివేసిన పులి ‘ఏవైన జంతువుల సమాచారం తెచ్చావా?’ అని అడిగింది. ‘అబ్బే..ఈ మధ్య జంతువులు తెలివి మీరిపోయాయ్. నేను మీకు విషయాలు చెబుతానని నన్ను కూడా దూరం పెట్టాయి’ అంటూ ఉన్న నిజమే చెప్పింది నక్క.


అయినా సరే నక్క తనతో అబద్ధం చెబుతోందని ఆగ్రహించిన పులి అమాంతంగా నక్కమీద పడి దాన్నే చంపి ఆరగించేసింది.

అందువల్ల చెడ్డవారితో ఎక్కువగా స్నేహం చేసి జిత్తులమారితనం ప్రదర్శించడం వల్ల, ఏదో ఒకరోజు మొదటికే మోసం వచ్చి నమ్మిన వాళ్ళకే కాకుండా సొంతవాళ్ళకూ దూరమౌతామని గ్రహించాలనే గుణపాఠం తన ముగింపుతో లోకానికిచ్చింది నక్క.

Post a Comment

Comments