గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సమస్యను పరిష్కరించమని కోరుతూ..
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో 2.50లక్షల మంది వాలంటీర్లు గత 5సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10వేలకు పెంచుతామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మానిఫోస్టోలో హామీలిచ్చింది. హామి ప్రకారం తమ వేతనాలు పెరగుతాయని వాలంటీర్లు ఎదురుచూస్తున్న తరుణంలో వేతనాలు పెంచకపోగా, నెలనెలా ఉన్న వేతనాలను ప్రభుత్వం చెల్లించడం లేదు. వీరందరి వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇచ్చిన హామి ప్రకారం వేతనం పెంచాలని, అందరినీ విధుల్లో కొనసాగించాలని సిపిఐ (ఎం) కోరుతున్నది.
వాలంటీర్లలో డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసినవారున్నారు. కేవలం 5వేల రూపాయాలకు పని చేయడానికి లక్షలాదిమంది సిద్ధపడ్డారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉన్నదో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. గత ప్రభుత్వం కనీస వేతనాలు కూడా చెల్లించకుండా వాలంటీర్ల చేత అవార్డులు, రివార్డులతో గొడ్డు చాకిరీ చేయించుకుంది. మీ ప్రభుత్వం వచ్చాకైనా ఇచ్చిన హామి ప్రకారం వేతనాలు పెరుగుతాయని వాలంటీర్లు ఎదురుచూస్తున్న తరుణంలో ఉన్న ఉపాధికి కూడా నష్టం కలిగేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైందికాదు.
గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా, బకాయి వేతనాలు చెల్లించి, ఇచ్చిన హామీ ప్రకారం 10వేల రూపాయాలు అమలు చేయాలని, బలవంతంగా రాజీనామాలు చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను.
Comments